లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సలహాదారుగా ఎమ్మెస్కే ప్రసాద్

  • గతంలో టీమిండియా సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన ఎమ్మెస్కే
  • ఇక ఐపీఎల్ లో సేవలు అందించనున్న వైనం
  • ఎమ్మెస్కే నియామకంపై ప్రకటన చేసిన లక్నో ఫ్రాంచైజీ
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇక ఐపీఎల్ లో సేవలు అందించనున్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు (స్ట్రాటజిక్ కన్సల్టెంట్) వ్యూహాత్మక అంశాల సలహాదారుగా నియమితుడయ్యాడు. ఈ మేరకు లక్నో ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో తెలిపింది. 

లక్నో సూపర్ జెయింట్స్ గత ఐపీఎల్ సీజన్ లో మెరుగైన ప్రదర్శనే కనబర్చింది. మొత్తం 14 మ్యాచ్ ల్లో 8 విజయాలు, 5 ఓటములతో ఓవరాల్  గా మూడో స్థానంలో నిలిచింది. 

అయితే, టైటిల్ పై కన్నేసిన లక్నో యాజమాన్యం... జట్టు కోచింగ్ విభాగంలో మార్పులు చేస్తోంది. గత సీజన్ లో చీఫ్ కోచ్ గా వ్యవహరించిన ఆండీ ఫ్లవర్ ను కొనసాగించేందుకు లక్నో ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ ఆర్పీఎస్జీ ఆసక్తి చూపించలేదు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు జస్టిన్ లాంగర్ ను హెడ్ కోచ్ గా నియమించింది. 

ఇప్పుడు, ప్రతిభావంతులను గుర్తించడంలోనూ, ఆట పరంగానూ ఎన్నో అంశాలపై పట్టు ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్ ను కూడా తమ బృందంలో చేర్చుకుంది. 

"మా ఆర్పీఎస్జీ స్పోర్ట్స్ విభాగంలో ప్రసాద్ సేవలు కీలకంగా మారతాయని భావిస్తున్నాం. ప్రతిభను అన్వేషించే విభాగానికి అధిపతిగా, ఆటగాళ్లు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునే అంశంలో సలహాదారుగా, మా అకాడమీ వ్యవహారాల్లోనూ విశిష్ట రీతిలో మార్గదర్శనం చేస్తాడని ఆశిస్తున్నాం" అంటూ ఎమ్మెస్కే నియామకంపై లక్నో ఫ్రాంచైజీ తన ప్రకటనలో పేర్కొంది. 

ఎమ్మెస్కే 2016 నుంచి 2020 వరకు టీమిండియా పురుషుల సీనియర్ జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించాడు. 1998-2000 మధ్య కాలంలో తన క్రికెట్ కెరీర్ లో టీమిండియా తరఫున 6 టెస్టులు, 17 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఫిట్ నెస్ సమస్యలు ఎమ్మెస్కే కెరీర్ కు ప్రతిబంధకంగా మారాయి.


More Telugu News