సిమ్ డీలర్లకు ఇక పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి: కేంద్రమంత్రి

  • సైబర్ నేరాలు అరికట్టేందుకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి
  • వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్‌లు విక్రయిస్తున్నారన్న కేంద్రమంత్రి
  • బల్క్ కనెక్షన్ల స్థానంలో బిజినెస్ కనెక్షన్ల పేరుతో కొత్త విధానం
సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం వెల్లడించారు. సైబర్ నేరాలు, మోసపూరిత ఫోన్ కాల్స్ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. బల్క్ సిమ్ కార్డు కనెక్షన్లు ఇవ్వడంపై కూడా ఆంక్షలు విధించింది.

ఈ మేరకు కేంద్రమంత్రి మాట్లాడుతూ... ప్రస్తుతం కొంతమంది సిమ్ డీలర్లు అక్రమ మార్గాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా సిమ్ కార్డులను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఇక నుండి అలాంటివి ఉండవన్నారు. సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్ తర్వాత వారు తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల సిమ్ డీలర్లు ఉన్నట్లు తెలిపారు. వారు వెరిఫికేషన్ పూర్తి చేయడానికి తగిన సమయం ఇస్తున్నట్లు చెప్పారు.

బల్క్ కనెక్షన్ల నిబంధనను తొలగించి, బిజినెస్ కనెక్షన్ల పేరుతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఇందులో వ్యక్తిగత కేవైసీ తప్పనిసరి అన్నారు.  అంటే ఏదైనా కంపెనీ నాలుగువేల సిమ్ కార్డులు తీసుకుంటే గతంలో కంపెనీ కేవైసీని మాత్రమే వెరిఫై చేసేవారని, కానీ ఇప్పుడు నాలుగువేల ఉద్యోగుల కేవైసీలను చేసిన తర్వాతే సిమ్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

52 లక్షల మొబైల్ కనెక్షన్లను ప్రభుత్వం డిస్‌కనెక్ట్ చేసిందని తెలిపారు. 67,000 మంది డీలర్లను బ్లాక్ లిస్ట్ చేయగా, మే 2023 నుండి సిమ్ కార్డ్ డీలర్లపై 300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. 66వేలకు పైగా మోసపూరిత వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపారు.

sim

More Telugu News