పాలు కాదు .. రక్తం తాగి పెరిగిన రాక్షసుడు: 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ రిలీజ్!
- 'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ
- కథానాయికగా నుపుర్ సనన్ పరిచయం
- కీలకమైన పాత్రలో రేణు దేశాయ్
- సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాశ్ కుమార్
- అక్టోబర్ 20 తేదీన ఐదు భాషల్లో విడుదల
రవితేజ ఈ ఏడాదిలో ఆల్రెడీ రెండు సార్లు ప్రేక్షకులను పలకరించాడు. 'వాల్తేరు వీరయ్య'లో చిరంజీవితో కలిసి కనిపించిన ఆయన, ఆ తరువాత 'రావణాసుర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఇది రవితేజ మార్క్ కి ఎంతమాత్రం సంబంధం లేని కంటెంట్ కావడంతో, ఆ సినిమా కనెక్ట్ కాలేకపోయింది. దాంతో రవితేజ అభిమానులు ఆయన తరువాత సినిమాపై దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలోనే రవితేజ తాజా చిత్రంగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూపొందింది. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకి, వంశీ దర్శకత్వం వహించాడు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. 'టైగర్ నాగేశ్వరరావు' మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకోవడంతో ఈ టీజర్ మొదలవుతుంది.
"పులి .. సింహం కూడా ఒక ఏజ్ వచ్చేవరకూ పాలే తాగుతాయి .. కానీ వీడు ఎనిమిదేళ్ల వయసు నుంచే రక్తం తాగడం మొదలుపెట్టాడు" అంటూ 'టైగర్ నాగేశ్వరరావు' పాత్రను పరిచయం చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంది. నుపుర్ సనన్ కథానాయికగా పరిచయమవుతుండగా, అనుపమ్ ఖేర్ .. మురళీ శర్మ . రేణు దేశాయ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఐదు భాషల్లో అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నారు.