విడదల రజని అవినీతికి అంతే లేదు: ప్రత్తిపాటి పుల్లారావు
- ఆరోగ్యశాఖను రజని నాశనం చేశారన్న ప్రత్తిపాటి పుల్లారావు
- ల్యాండ్ సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆరోపణ
- రజని కుటుంబసభ్యులు అవినీతి వ్యవహారాలను నడిపిస్తున్నారని వ్యాఖ్య
ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. విడదల రజనీ అవినీతికి అంతే లేదని, అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్యశాఖను నాశనం చేసేశారని, ఆసుపత్రుల్లో కనీస ఔషధాలు కూడా అందుబాటులో లేవని చెప్పారు. వైద్యశాఖలో పోస్టుల భర్తీలు, బదిలీలలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. భూవివాదాలు ఉన్నచోట కలగజేసుకుని సెటిల్ మెంట్లు చేస్తున్నారని అన్నారు. తమ కుటుంబసభ్యులతో అవినీతి వ్యవహారాలను నడిపిస్తున్నారని చెప్పారు. చిలకలూరిపేట మున్సిపాలిటీని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చుకున్నారని మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా మంత్రి కుటుంబీకులేనని, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో రూ. 50 లక్షల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు.