'మ్యాజిక్ మిర్రర్'కి ఆశపడి.. రూ.9 లక్షలు నష్టపోయిన వృద్ధుడు
- అద్దంలో నుంచి చూస్తే వివస్త్రలుగా కనిపించే ప్రత్యేకత ఉందంటూ నమ్మించిన మోసగాళ్లు
- భవిష్యత్ గురించి చెబుతుందంటూ మోసపూరిత మాటలు
- మోసపోయానని గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు.. మ్యాజిక్ మిర్రర్ కోసం ఆశపడి నిండా మోసపోయాడు. రూ.100 లేదా రూ.500 కాదు.. అద్దం కోసం రూ.9 లక్షలు చెల్లించుకున్నాడు. ఇంతకీ ఆ అద్దంలో (మిర్రర్) ఉన్న మ్యాజిక్ ఏంటో తెలిస్తే నవ్వాలో, అమాయకుడైన వృద్ధుడిని చూసి ఏడవాలో తెలియదు. సదరు మ్యాజిక్ మిర్రర్ నుంచి చూస్తే ఎవరైనా కానీ వస్త్రాల్లేకుండా కనిపిస్తారట.
ఈ అద్దం భవిష్యత్తు గురించి చూడా చెబుతుందట. దీని విలువ రూ.2 కోట్లు అని, నాసా శాస్త్రవేత్తలు ఉపయోగించే అద్దం అంటూ వృద్ధుడికి మత్తు ఎక్కించే మాటలు చెప్పారు. ప్రాచీన కళాకృతులు, వస్తువులను సేకరించే సింగపూర్ కంపెనీ ఉద్యోగులుగా తమను పరిచయం చేసుకున్నారు. భవనేశ్వర్ కు వస్తే అద్దం అందజేస్తామని చెప్పారు. దీంతో రూ.9 లక్షలు చెల్లించుకున్నాడు. తీరా చేతికి వచ్చిన అద్దం ముఖ భాగం విరిగిపోయి ఉండడంతో దాన్ని వృద్ధుడు తిరస్కరించాడు. చివరికి ఈ కథ పోలీసు స్టేషన్ కు చేరింది. వృద్ధుడిని నిండా ముంచిన ముగ్గురు పశ్చిమబెంగాల్ రాష్ట్ర వాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.