పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారినా?: మంచు విష్ణు
- సినిమా ఇండస్ట్రీలో పవన్ ఓ సూపర్ స్టార్ అన్న మంచు విష్ణు
- ఆయన రాజకీయాల గురించి తాను చెప్పలేనని వ్యాఖ్య
- సినీ రంగానికి చెందిన మహానుభావుల లాంటివారే ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య
- ఏపీలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలు, రాజకీయాలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారినా? పవన్ సినిమాల గురించి అయితే చెప్పగలను. సినిమా ఇండస్ట్రీలో ఆయనో సూపర్ స్టార్.. ఇందులో సందేహమే లేదు. పవన్‌కు సంబంధించి ఒక సినిమా ఆడకపోయినా మరో సినిమాలో రెట్టింపు కలెక్షన్స్ వస్తాయి” అని చెప్పారు.
పవన్ రాజకీయాల గురించి మాత్రం తాను చెప్పలేనని మంచు విష్ణు అన్నారు. రాజకీయాల విషయంలో ప్రజలు చాలా స్మార్ట్‌గా ఉన్నారని అన్నారు. నచ్చిన వాళ్ల సినిమా వస్తే చూస్తారని, కానీ ఓటేయాలని అనుకున్నప్పుడు వాళ్లకు నచ్చిన వ్యక్తికే ఓటేస్తారని చెప్పారు. సినిమా రంగంలో మహానుభావులు లాంటి వారే రాజకీయాల్లో ఓడిపోయారని గుర్తు చేశారు.
ఎవరైతే తన గ్రామాన్ని, తన దేశాన్ని, తన జీవితాన్ని బాగు చేస్తారని నమ్ముతారో.. వారివైపే ప్రజలు ఉంటారని మంచు విష్ణు అన్నారు. మరో ఆరు నెలలు ఆగితే రాజకీయాల్లో ఏం జరుగుతుందో చెబుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను చంద్రగిరి నుంచి పోటీ చేయబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఏపీలో నవరత్నాలు ప్రోగ్రాం చాలా బాగుందని, ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఏపీలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఇదే విషయాన్ని సర్వేలన్నీ చెబుతున్నాయని చెప్పుకొచ్చారు.