మహిళా అభ్యర్థుల విషయంలో ఛాతీ పరీక్షలకు ప్రత్యామ్నాయం చూడండి: రాజస్థాన్ హైకోర్టు

  • ఊపిరితిత్తుల సామర్థ్యానికి ఛాతీ కొలవడంపై కోర్టు విస్మయం
  • పోస్టులు ఏవైనా ఈ తరహా పరీక్ష సరికాదని వ్యాఖ్య
  • ఇది వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుందన్న హైకోర్టు
ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలలో భాగంగా మహిళలకు ఛాతీ పరీక్షలను నిర్వహించడంపై రాజస్థాన్ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అభ్యర్థినుల ఊపిరితిత్తుల సామర్థ్యం తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొనడాన్ని తప్పుబట్టింది. దానికోసం ఇతరత్రా మార్గాలను వెతకాలని, ఇందుకోసం వైద్య నిపుణుల సూచనలు తీసుకోవాలని సూచించింది. నియామక పరీక్షలలో ఛాతీ కొలతలు తీసే ప్రక్రియ మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుందని జస్టిస్ దినేశ్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇది పూర్తిగా సిగ్గుమాలిన చర్య అని మండిపడింది.

పోలీస్, అటవీ శాఖ ఉద్యోగాలతో పాటు మరే ఇతర ఉద్యోగ నియామకాలైనా సరే మహిళా అభ్యర్థులకు ఛాతీ కొలతలు తీసే ప్రక్రియను తొలగించాలని సూచించింది. ఈమేరకు ఫారెస్ట్ గార్డ్ నియామక పరీక్షలో తమను అనర్హులుగా ప్రకటించడంపై ముగ్గురు అభ్యర్థినులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో జస్టిస్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఫారెస్ట్ గార్డ్ నియామకాల కోసం రాజస్థాన్ ప్రభుత్వం పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో తాము నెగ్గినా కూడా ఛాతీ పరీక్షలో ఫెయిలయ్యారని ప్రకటించడంతో ముగ్గురు అభ్యర్థినులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ దినేశ్ మెహతా ధర్మాసనం.. మహిళా అభ్యర్థినులకు ఛాతీ పరీక్షలు నిర్వహించడం నిర్హేతుకమైన చర్య అంటూ ఆక్షేపించింది. అయితే, ఇప్పటికే ఫారెస్ట్ గార్డ్ నియామకాలు పూర్తవడంతో ఆ ప్రక్రియలో జోక్యం చేసుకోరాదని నిర్ణయించింది. ముగ్గురు అభ్యర్థినులు అనర్హులేనంటూ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అదేసమయంలో ఎంపిక ప్రక్రియలో నిర్వహిస్తున్న ఛాతీ కొలతలు తీసే పరీక్షను తప్పుబట్టింది. దానికి ప్రత్యామ్నాయం వెతకాలని ప్రభుత్వానికి సూచించింది.


More Telugu News