బజరంగ్‌దళ్‌ను మేం నిషేధించం, కానీ..!: దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

  • తాము అధికారంలోకి వస్తే గూండాలు, అల్లర్లను ప్రేరేపించే వారి పనిపడతామన్న దిగ్విజయ్
  • బీజేపీ నేతల కంటే తానే గొప్ప హిందువునన్న మాజీ సీఎం
  • మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించడం మానుకోవాలని బీజేపీకి హితవు
బజరంగ్‌దళ్‌పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధించబోమని, కాకపోతే గూండాలను, అల్లర్లను ప్రేరేపించే వారిని మాత్రం వదలబోమని హెచ్చరించారు. భోపాల్‌లోని పీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తారా? అన్న ప్రశ్నకు దిగ్విజయ్ బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందుత్వ అంశంపై మాట్లాడుతూ.. తాను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ హిందువునేనని స్పష్టం చేశారు. తాను హిందూ మతాన్ని అనుసరిస్తానని, సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తుల్లో తానూ ఒకడినని వివరించారు. అంతేకాదు, బీజేపీ నేతల కంటే తానే గొప్ప హిందువునని తనకు తాను కితాబునిచ్చుకున్నారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించడం మానుకోవాలని దిగ్విజయ్ హితవు పలికారు. ఈ దేశం హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులదని స్పష్టం చేశారు. దేశంలో శాంతి నెలకొల్పాలన్న ఆయన.. అది శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. 


More Telugu News