అప్పటికంటే ఇప్పుడే టెన్షన్ ఎక్కువ.. చంద్రయాన్-3పై ఇస్రో మాజీ చీఫ్ కామెంట్

  • చంద్రయాన్-3 తప్పకుండా విజయం సాధిస్తుందన్న ఇస్రో మాజీ చీఫ్ శివన్
  • మునుపటి వైఫల్యానికి కారణాలను పూర్తిగా అర్థం చేసుకున్నామని వెల్లడి
  • ఈసారి సమస్యలను తట్టుకునేలా ఏర్పాట్లు చేసినట్టు వివరణ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఈమారు విజయం సాధిస్తుందని తాను బలంగా నమ్ముతున్నట్టు సంస్థ మాజీ చీఫ్ కె.శివన్ తాజాగా పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్‌కు చివరి నిమిషంలో అవాంతరం ఎదురైన విషయం తెలిసిందే. నాడు చంద్రుడిపై దిగే క్రమంలో ల్యాండర్ విఫలమైంది. 

కాగా, చంద్రయాన్-3పై కె.శివన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 23న జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండర్ దిగే క్షణం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు. చంద్రయాన్-3 లాగే గత ప్రయోగం కూడా అన్ని దశలూ విజయవంతంగా పూర్తి చేసుకున్నా చివరి నిమిషంలో సమస్య ఎదురైందని తెలిపారు. 

‘‘గతంలో కంటే ఇప్పుడు చంద్రయాన్-3 ల్యాండర్ జాబిల్లిపై దిగే క్రమంలో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మునుపు ఈ ప్రయోగం సక్సెస్ కాలేకపోయింది. అయితే, ఈసారి మేం కచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ముునుపటి వైఫల్యానికి గల కారణాలను అర్థం చేసుకున్నాం. తప్పులను సరిదిద్దుకున్నాం. ఒక వ్యవస్థ విఫలమైతే దాన్ని మరో దానితో భర్తీ చేసేలా రిడండ్సెన్సీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మారు చంద్రయాన్ కచ్చితంగా విజయం సాధిస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. 

కాగా, చంద్రుడి కక్ష్యలో ప్రవేశానికి సంబంధించి అన్ని దశలను చంద్రయాన్-3 పూర్తి చేసుకుంది. ప్రస్తుతం వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్(చోదక వ్యవస్థ) నుంచి ల్యాండర్‌ను వేరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ దశలో చంద్రయాన్-3 రెండు భాగాలుగా.. అంటే ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యూల్‌గా విడిపోతుందని ఇస్రో మాజీ చీఫ్ శివన్ వివరించారు. ఈ ప్రక్రియ ఎటువంటి సమస్యల్లేకుండా పూర్తవుతుందని చెప్పారు.


More Telugu News