భారత్–పాక్ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ రాబోతున్న అభిమానులకు చుక్కలు చూపెడుతున్న హోటళ్లు​

  • ఏకంగా 15 రెట్లు పెరిగిన హోటల్ గదుల ధరలు
  • రూ. 4 వేల గదికి రూ. 60 వేలు వసూలు
  • అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్
క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా స్టేడియంలో చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పోటీ పడుతుంటారు. అయితే, భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వరల్డ్‌ కప్‌లో భాగంగా అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌లో జరిగే ఇండో–పాక్‌ మ్యాచ్‌ను స్టేడియంలో చూడాలని ఆశిస్తున్న అభిమానులకు అక్కడి హోటళ్లు చుక్కలు చూపెడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చే అభిమానులు తమ వీసా, విమాన చార్జీల కంటే అహ్మదాబాద్ లో ఓ రాత్రి ఉండేందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎందుకంటే ఈ మ్యాచ్ జరిగే సమయంలో అహ్మదాబాద్‌లో హోటల్ గదుల ధరలు ఏకంగా 15 రెట్లు పెరిగాయి. 

సాధారణ హోటల్‌లో ఒక రోజుకు రూ. 4 వేలు ఉండాల్సిన ధరను ఏకంగా 60 వేలకు పెంచారు. స్టార్‌ హోటళ్లలో రెండు రాత్రుల బసకు మూడున్నర లక్షలు వసూలు చేస్తున్నారు. నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో ఈ మ్యాచ్ ను అక్టోబర్ 15 నుంచి ఒక రోజు ముందుకు జరిపారు. 15న మ్యాచ్ జరుగుతుందని ముందుగానే గదులు బుక్‌ చేసుకున్న వాళ్ల తేదీని మార్చడానికే పది వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇంత మొత్తం చెల్లించి హోటల్‌ రూమ్‌ బుక్‌ చేసుకుందామన్నా.. మ్యాచ్‌ టికెట్లు దొరుకుతాయో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ మ్యాచ్‌ టికెట్లు సెప్టెంబర్ 3న అందుబాటులోకి రానున్నాయి.


More Telugu News