పెద్ద మనసు చేసుకొని ఐపీఎల్‌ జట్టును కాపాడిన బాలీవుడ్ స్టార్​ అక్షయ్ కుమార్

  • 2009లో పెద్ద మొత్తంతో ఢిల్లీ ఫ్రాంచైజీతో అక్షయ్ కాంట్రాక్టు
  • మూడేళ్ల పాటు ప్రమోషన్స్ ఇతర ఈవెంట్లలో
    పాల్గొనేలా ఒప్పందం
  • తొలి సీజన్ తోనే నష్టాల్లోకి వెళ్లిన ఢిల్లీ జట్టు
  • నష్ట పరిహారం అడగకుండా అక్షయ్ కాంట్రాక్టు వదులుకున్నట్టు తన ఆత్మకథలో వెల్లడించిన
    ఓ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌‌
ఐపీఎల్‌లో అత్యంత పేలవమైన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ప్రారంభంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ ఉన్న జట్టు పేరును మార్చినా ఆ జట్టు ఆట మారలేదు. 16 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌‌ కింగ్స్‌ ఆటతో పాటు లాభాల్లోనూ దూసుకెళ్తుంటే ఆ జట్టు మాత్రం ఆరంభంలోనే చాలా నష్టాలు చవి చూసింది. బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ మంచి మనసు కారణంగా ఢిల్లీ ఫ్రాంచైజీ మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా తప్పించుకుంది. వెటరన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథూర్ ఆత్మకథ  'పిచ్‌సైడ్: మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్' పుస్తకం ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ పుక్తకంలో మాథూర్ వెల్లడించిన విషయాల ప్రకారం ఢిల్లీ టీమ్ కు సంబంధించిన ప్రమోషనల్ చిత్రాల్లో నటించడానికి, మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌లకు హాజరయ్యేందుకు, కార్పొరేట్ ఈవెంట్‌లలో కనిపించడానికి అక్షయ్ 2009లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ (డీడీ)తో మూడు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశారు. దీనికోసం చాలా పెద్ద మొత్తం ముట్టజెప్పేందుకు ఢిల్లీ ఫ్రాంచైజీ ఒప్పుకుంది. కానీ, 2008 సీజన్ తర్వాత ఢిల్లీ జట్టు ఆర్థికంగా నష్టపోయింది. దాంతో, అక్షయ్ కు కాంట్రాక్టును కొనసాగిస్తే మరింత నష్టపోతామని భావించిన ఢిల్లీ యాజమాన్యం దాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. కానీ, ముందుగానే ఒప్పందం కుదుర్చుకోవడంతో అక్షయ్ కాంట్రాక్టును రద్దు చేసినా భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో నష్టపరిహారం చెల్లించకుండా ఒప్పందం రద్దు చేసుకోవాలని అక్షయ్ ను విజ్ఞప్తి చేసేందుకు మాథూర్ ను ఢిల్లీ జట్టు రంగంలోకి దింపింది. 

దాంతో చాందినీ చౌక్ టు చైనా షూటింగ్ సమయంలో అక్షయ్ ను కలిశానని మాథూర్ పేర్కొన్నారు. ‘నేను చాలా సంకోచిస్తూ జరిగిన విషయం అక్షయ్ కు చెప్పాను. డీడీ ఆర్థిక ఇబ్బందులను వివరించాను. ఆయన మరో ఆలోచనే లేకుండా 'పర్వాలేదండీ.. ఇది వర్కౌట్ కాకపోతే వదిలేద్దాం' అన్నారు. నాకు సరిగ్గా అర్థం కాలేదు. నా అయోమయ రూపాన్ని చూసిన అక్షయ్ కాంట్రాక్టును రద్దు చేద్దాం అన్నారు. నేను కఠినమైన కాంట్రాక్ట్ నిబంధనల గురించి గొణుగుతున్నప్పుడు.. ఏం ఫర్వాలేదు నా లాయర్‌కి చెప్తాను అంటూ భరోసా ఇచ్చారు’ అని మాధుర్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. అక్షయ్ ఇంత పెద్ద మొత్తంలో డబ్బును వదులుకోవడం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా తనకు ఆశ్చర్యంగానే ఉందని పేర్కొన్నారు.


More Telugu News