హిమాచల్, ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. 66 మంది మృతి

  • వందలాది మందికి గాయాలు
  • కొండచరియలు విరిగిపడి కుప్పకూలుతున్న ఇళ్లు
  • మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన
ఉత్తరాదిలో వర్షాలు, వరదలు మరోసారి ముంచెత్తుతున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడటంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో 66 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. వారిని రక్షించడానికి, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధిక మరణాలు సంభవించాయని , ఈ నెల 13న  భారీ వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి 60 మంది మరణించారని ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్‌లో, మరో నాలుగు రోజుల్లో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దాంతో, ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు.

కాగా సిమ్లా, జోషిమఠ్ లో ఇళ్లు నేలకూలి అధిక ప్రాణనష్టం జరుగుతోంది. మంగళవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాల నుంచి మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. సిమ్లాలో కూలిన శివాలయం శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. నగరంలో కొండచరియలు విరిగిపడటంతో తాజాగా మరో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు విద్యాశాఖ ఈ రోజు సెలవు ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీతో పాటు పోలీసులు ఈ ఉదయం 6 గంటలకు సమ్మర్ హిల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లను తిరిగి ప్రారంభించాయని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి తెలిపారు.


More Telugu News