పుట్టినరోజు నాడు తన మిత్రుడిని తలుచుకుని భావోద్వేగానికి గురైన కేజ్రీవాల్
- ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్
- మనీశ్ సిసోడియాను ఎంతో మిస్ అవుతున్నానని భావోద్వేగం
- తప్పుడు కేసులో ఆయనను జైలుకు పంపించారని మండిపాటు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆయనకు ప్రధాని మోదీ సహా ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తన పుట్టినరోజు అనే సంతోషం కన్నా, తన మిత్రుడు తనకు దూరమయ్యారనే బాధ ఆయనను కలచివేస్తోంది. కేజ్రీవాల్ ఆప్త మిత్రుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన నిందితుడిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. 'ఈరోజు నా పుట్టినరోజు. ఎంతో మంది నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గ్రీటింగ్స్ చెపుతున్న అందరికీ ధన్యవాదాలు. కానీ, మనీశ్ ను నేను ఎంతో మిస్ అవుతున్నా. ఒక తప్పుడు కేసులో ఆయన జైల్లో ఉన్నారు. మన దేశంలో పుట్టిన ప్రతి చిన్నారికి మంచి విద్యను అందించేందుకు తమ శక్తి మేరకు అన్నీ చేస్తామని ఆరోజు అందరం ప్రతిజ్ఞ చేద్దాం. ఇది శక్తిమంతమైన భారతదేశానికి పునాది వేస్తుంది. ఇండియాను నెంబర్ వన్ చేయాలనే కలను ఇది నెరవేరుస్తుంది. ఇది మనీశ్ కు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది' అని ట్వీట్ చేశారు.