వాళ్ల మాదిరి మీరు చరిత్రను సృష్టించలేరు.. అందుకే పేర్లు మారుస్తున్నారు: సంజయ్ రౌత్
- ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును మార్చిన కేంద్రం
- ఇక వాళ్లకు మిగిలింది ఏముందని సంజయ్ రౌత్ ఎద్దేవా
- చరిత్రలో పండిట్ నెహ్రూ పేరును మార్చలేరని వ్యాఖ్య
దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఢిల్లీలో ఉన్న మెమోరియల్ మ్యూజియం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చారు. ప్రజాస్వామికీకరణలో భాగంగానే ఈ మార్పును చేసినట్టు మ్యూజియం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఇక వాళ్లకు మిగిలింది ఏముందని ఆయన ప్రశ్నించారు. ఒక బిల్డింగ్ కు ఉన్న పేరును మాత్రమే మీరు మార్చగలరని... చరిత్రలో పేర్కొన్న పండిట్ నెహ్రూ పేరును మార్చలేరని విమర్శించారు. మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సావర్కర్ మాదిరి మీరు చరిత్రను సృష్టించలేరని... అందుకే పేర్లను మార్చే పని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.