శరద్ పవార్‌తో భేటీపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు

  • కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సమావేశాన్ని మీడియా తనకు నచ్చినట్లుగా రాస్తోందన్న అజిత్ 
  • మీడియా ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని వ్యాఖ్య
  • తాను కారులో రహస్యంగా వెళ్లలేదని స్పష్టీకరణ
తన బాబాయ్ శరద్ పవార్‌తో ఇటీవల జరిగిన సమావేశం సాధారణమైనదేనని, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. ఈ భేటీకి సంబంధించి శరద్ పవార్ కూడా స్పష్టతనిచ్చారన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సమావేశాన్ని మీడియా తనకు నచ్చినట్లుగా, ఏవేవో కల్పించి చెబుతోందన్నారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తోందన్నారు.

శరద్ పవార్, అజిత్ పవార్ పూణేలో రహస్యంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు ఓ వ్యాపారవేత్త ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశనికి ఎన్సీపీ సీనియర్ నేత జయంత్ పాటిల్ కూడా హాజరయ్యారు. అయితే భేటీకి రహస్యంగా ఎందుకు వెళ్లారని మీడియా ప్రశ్నించగా... ఆ కారులో తాను లేనని అజిత్ పవార్ చెప్పారు. తనకు రహస్యంగా వెళ్లాల్సిన అవసరం లేదని, ఏం చేసినా బాహాటంగానే చేస్తానన్నారు. వ్యాపారవేత్త అతుల్ కుటుంబంతో తమకు రెండు తరాల నుండి మంచి సంబంధాలు ఉన్నాయని అజిత్ అన్నారు. శరద్ పవార్‌ను శనివారం అతుల్ భోజనానికి ఆహ్వానించారని, తాను కూడా అక్కడకు వెళ్లానన్నారు.


More Telugu News