గద్దర్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ.. 1997 నాటి కాల్పుల ఘటనపై స్పందన!
- ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గద్దర్
- ఈ రోజు హైదరాబాద్‌లోని గద్దర్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు
- కుటుంబ సభ్యుల పరామర్శ.. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్పు
- కాల్పుల ఘటనపై తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న చంద్రబాబు
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఇటీవల అనారోగ్యంతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గద్దర్ కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. మంగళవారం హైదరాబాద్ అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌తో కలిసి చంద్రబాబు వెళ్లారు. గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మరోవైపు 1997లో గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనపై చంద్రబాబు స్పందించారు. కాల్పుల ఘటన విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని అపోహలు సృష్టించారని అన్నారు. ‘‘నాటి కాల్పుల తర్వాత గద్దర్ నాతో అనేకసార్లు మాట్లాడారు. ఇద్దరం కలిసి పని చేశాం. నా లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒక్కటే. పేదల హక్కుల పరిరక్షణే మా ధ్యేయం” అని వివరించారు.
అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. గద్దర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ‘‘గద్దర్‌ను చూస్తేనే ఓ ప్రజా యుద్ద నౌక గుర్తుకు వస్తుంది. భయమంటే తెలియని వ్యక్తి. పోరాటాలే ఆయన ఊపిరి. అలాంటి వ్యక్తి మరణం బాధాకరం. ఆయన స్ఫూర్తి శాశ్వతంగా ఉంటుంది. ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు పని చేస్తాం” అని చెప్పారు.