లాల్‌ జాన్‌ బాషా 10వ వర్ధంతి.. టీడీపీ ఘన నివాళి

  • లాల్‌ జాన్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు
  • రెండు దశాబ్దాల పాటు పార్టీకి ఎంతో సేవ చేశారని వెల్లడి
  • దేశవ్యాప్తంగా మైనార్టీల సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారన్న నేతలు
టీడీపీ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు లాల్‌ జాన్‌ బాషా 10వ వర్ధంతి సందర్భంగా పార్టీ నేతలు ఘన నివాళి అర్పించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లాల్‌ జాన్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు దశాబ్దాల పాటు పార్టీకి ఆయన చేసిన సేవలను నేతలు కొనియాడారు. టీడీపీ నిర్మాణాత్మక కార్యక్రమాల్లో, సంస్థాగత వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. 1991లో గుంటూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన మొట్టమొదటి టీడీపీ ఎంపీగా రికార్డు సృష్టించారని గుర్తు చేసుకున్నారు.

టీడీపీకి లాల్‌ జాన్‌ బాషా చేసిన సేవలను గుర్తించి 2002లో పార్టీ అధినేత చంద్రబాబు ఆయన్ను రాజ్యసభ సభ్యునిగా నియమించారని చెప్పారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, మర్కంటైల్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా, టీడీపీ మైనార్టీ విభాగ చైర్మన్‌గా విశేష సేవలు అందించారని తెలిపారు. దేశవ్యాప్తంగా మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వామిదాసు, జనాబ్ హాజీ షేక్ హసన్ బాషా, చిన్న బాజీ, ఎస్.పి. సాహెబ్, హుసేన్, నాదెండ్ల బ్రహ్మం చౌదరి, లక్ష్మీపతినాయుడు, దారపనేని నరేంద్ర బాబు, పారం కిశోర్, కృష్ణ, రేవతి, పీరయ్య, అఖిల్, పులి చిన్నా, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

లాల్‌ జాన్‌ బాషా, 2013 ఆగస్టు 15వ తేదీన..  గుంటూరుకు వెళ్తుండగా  విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్గొండ సమీపంలోని నార్కట్‌పల్లి వద్ద తాను ప్రయాణించే కారు  డివైడర్‌ను ఢీకొనడంతో  రోడ్డు ప్రమాదంలో మరణించారు.


More Telugu News