కేటీఆర్ అండతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన అనాథ బాలిక!

  • చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన రుద్ర రచన
  • కేటీఆర్ అండతో ఇంజినీరింగ్ చదివి ఇటీవల ఉద్యోగం సంపాదించిన వైనం
  • ఇందుకు కృతజ్ఞతగా తనలాంటి అనాథలను ఆదుకునేందుకు సిద్ధమైన యువతి
  • తన వేతనంలో రూ. లక్ష సీఎం సహాయనిధికి చెక్కు రూపంలో విరాళం
  • తనకు అండగా నిలిచిన కేటీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్
  • ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి లోనైన కేటీఆర్
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలిక, మంత్రి కేటీఆర్ అండతో చదువుల తల్లిగా ఎదిగింది. ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆ యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. మంత్రి సాయంతో జీవితంలో ఉన్నతస్థితికి ఎదిగిన యువతి అక్కడితో ఆగిపోలేదు. తనలాంటి ఎందరో అనాథలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. తన వేతనంలో రూ.లక్ష రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసింది. ఆమె ఎదుగుదలను చూసి మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల్ గ్రామానికి చెందిన ఆ యువతి పేరు రుద్ర రచన.

ఇటీవల రచన ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘తల్లిదండ్రులు లేని నాకు కేటీఆర్ అండగా నిలిచారు. బీటెక్ పూర్తి చేసిన నేను ఇటీవలే ఉద్యోగాన్ని సంపాదించా. నా వేతనంలో రూ.లక్షను సీఎం సహాయ నిధికి అందజేశా. మంత్రి కేటీఆర్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ధన్యవాదాలు తెలిపారు.

 యువతి ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు. ‘‘ఎంత అద్భుతమైన ఆలోచన! చాలా గొప్ప పని చేశావు రచన. నీ ట్వీట్ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్థికసాయాన్ని అందుకుంటున్న తన ఫొటోను, బీటెక్ పూర్తయిన తరువాత కేటీఆర్‌కు రాఖీ కడుతున్న చిత్రాన్ని, సీఎం సహాయనిధికి రూ.లక్ష ఇచ్చిన సందర్భంగా జారీ చేసిన సర్టిఫికేట్‌ను రచన ట్విట్టర్‌లో పంచుకున్నారు.


More Telugu News