‘నీట్’లో క్వాలిఫై కాలేదని విద్యార్థి ఆత్మహత్య.. ఆ బాధతో తండ్రి కూడా.. తమిళనాడులో విషాదం!

  • 2022 నుంచి నీట్‌ శిక్షణ తీసుకుంటున్న జగదీశ్వరన్
  • రెండు సార్లు పరీక్ష రాసినా అర్హత సాధించకపోవడంతో మనస్తాపం
  • 12న ఉరేసుకుని ఆత్మహత్య.. ఈరోజు అతడి తండ్రి బలవన్మరణం
  • విద్యార్థులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని స్టాలిన్ విజ్ఞప్తి
రెండు సార్లు ప్రయత్నించినా నీట్‌ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టస్ట్)లో ర్యాంకు రాలేదన్న మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుందీ విషాద సంఘటన.

2022లో ఇంటర్ (12వ తరగతి) పూర్తి చేసిన జగదీశ్వరన్.. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌కు శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండు సార్లు పరీక్ష రాసినా నీట్‌లో క్వాలిఫై కాలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఈనెల 12న చెన్నైలోని క్రోమెపేట్‌లో ఉరేసుకున్నాడు. వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

నీట్‌ క్వాలిఫై కాలేదన్న మనస్తాపంతోనే అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఎలాంటి సూసైడ్‌ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. 
తన కొడుకు మృతికి ‘నీట్’నే కారణమని జగదీశ్వరన్ తండ్రి సెల్వశేఖర్ ఆరోపించాడు. ఈ క్రమంలో సోమవారం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. విద్యార్థులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఆత్మ విశ్వాసంతో జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. జగదీశ్వరన్, సెల్వశేఖర్ మృతిపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. నీట్ వల్ల జరిగిన చివరి మరణాలు ఇవే కావాలని అన్నారు. నీట్ అడ్డంకులు తొలగిపోతాయని అన్నారు.


More Telugu News