ఆరోగ్యశ్రీ కింద పవన్ కల్యాణ్‌కు చికిత్స అందించాలని జగన్‌కు విజ్ఞప్తి చేస్తాం: రోజా

  • పవన్ మాటలు చూస్తుంటే జగన్‌పై ఎంత కడుపుమంట ఉందో తెలుస్తోందన్న మంత్రి
  • రుషికొండలో జగన్ సమాధి కావాలని దారుణంగా మాట్లాడారని ఆగ్రహం
  • అరిచి అరిచి గుండె పగిలి చచ్చిపోతాడేమోనని భయమేస్తోందని ఎద్దేవా
  • జగన్ వెళ్లడానికి సొంత నియోజకవర్గం పులివెందుల ఉందని వెల్లడి
  • పవన్ కల్యాణ్ భవిష్యత్తులోనూ కనీసం ఎమ్మెల్యేగా గెలవడని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ... పవన్ నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే జగన్‌పై ఎంత కడుపు మంటగా ఉందో, ఎంత జెలసీ ఉందో అర్థమవుతోందన్నారు. తన కంటే చిన్నవాడైన జగన్‌కు ప్రజల్లో అభిమానం పెరుగుతుంటే చూసి సహించలేక దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. భూమి పేలిపోవాలి.. రుషికొండ అందులోకి వెళ్లాలి... అందులో జగన్ సమాధి కావాలని దారుణంగా మాట్లాడారని, ఆయన ఇలా అరిచి అరిచి గుండె పగిలి చచ్చిపోతాడేమో అని భయమేస్తోందన్నారు.

ఆరోగ్యశ్రీ కింద కడుపు మంట కల్యాణ్‌గా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని జగన్‌ను కోరుతామని తెలిపారు. అప్పటికీ ఆయన కడుపు మంట చల్లారకుంటే కనుక హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తామన్నారు. అమరావతిలో బినామీల భూముల రేట్లు పడిపోతాయనే భయంతోనే రుషికొండపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. జగన్ వెళ్లడానికి సొంత నియోజకవర్గం పులివెందుల ఉందని, కానీ జనసేనానికి ఏముందని ప్రశ్నించారు. వారికి సొంత నియోజకవర్గం లేదని, వారి నియోజకవర్గంలోనే కుటుంబాన్నే ఓడించారన్నారు. అసలు ఏపీలో సొంత ఇల్లు కూడా లేదన్నారు. 

పవన్ కల్యాణ్ భవిష్యత్తులోనూ కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరన్నారు. ఇప్పటికైనా షూటింగ్ చేసుకుంటే కనీసం డబ్బులైనా వస్తాయని, కానీ ఇలా ఎండల్లో తిరిగి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలతో రాళ్ల దెబ్బలు తప్పవని హెచ్చరించారు. టీడీపీపై కూడా రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల ముందు ఏ మొహంతో వారు సెల్ఫీలు దిగారని ప్రశ్నించారు. వారిది సెల్ఫీ ఛాలెంజ్ కాదని, టీడీపీ సెల్ఫ్ గోల్ అన్నారు. టిడ్కో ఇళ్ల నుండి డబ్బులు వసూలు చేశారన్నారు.


More Telugu News