రిషికొండలో పవన్ విన్యాసాలు, పూనకం, అరుపులు తప్ప ఇంకేం లేవు: సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు

  • పవన్ కల్యాణ్ యజమాని చంద్రబాబేనన్న సజ్జల
  • వాళ్లిద్దరూ ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఫైర్
  • పవన్ పూనకాలు దేనికి సంకేతమని ప్రశ్న
  • విశాఖలో కారుకూతలు, పిచ్చికూతలు కూశారని మండిపాటు
పవన్ కల్యాణ్ యజమాని చంద్రబాబేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీకి పట్టిన శని చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండలో పవన్ కల్యాణ్ విన్యాసాలు చేశారని ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు, పవన్.. ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. చట్టాలను పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు.. అరాచక శక్తుల మూక” అని విమర్శించారు.

సోమవారం తాడేపల్లిలో మీడియాతో సజ్జల మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విశాఖలో పవన్ కారుకూతలు, పిచ్చికూతలు కూశారని మండిపడ్డారు. ‘‘ఎందుకు అంతలా ఊగటం? పవన్ ప్రసంగాలకు, వచ్చే ఎన్నికలకు సంబంధం ఉందా? పవన్ పూనకాలు దేనికి సంకేతం? పూనకం, అరుపులు, తిట్లు తప్ప పవన్ ప్రసంగంలో ఏమీ లేదు” అని అన్నారు. 

పనిగట్టుకొని, పద్ధతి ప్రకారం ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని సజ్జల ఆరోపించారు. అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ఎలా రెచ్చగొట్టారో ప్రజలు అందరూ చూశారని అన్నారు. పోలీసులపై విరుచుకుపడ్డారని చెప్పారు. పోలీసులు సంయమనంతో లేకపోతే ఘోరం జరిగేదని ఆయన అన్నారు.


More Telugu News