రామ్ గోపాల్ వర్మకు బహిరంగ సవాల్ విసిరిన దేవినేని ఉమా

  • దమ్ముంటే టీడీపీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలంటూ దేవినేని సవాల్
  • ఏ మొహం పెట్టుకుని పట్టిసీమ వద్ద షూటింగ్ చేస్తున్నారని విమర్శ
  • పట్టిసీమను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపాటు
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే తెలుగుదేశం హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలని ఛాలెంజ్ చేశారు. పట్టిసీమ దండగ అని వైసీపీ నేతలు ప్రచారం చేశారని... ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అక్కడ షూటింగ్ చేయడానికి ఆర్జీవీని పంపించారని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం పట్టిసీమను పట్టించుకోలేదని, కనీసం మెయింటెనెన్స్ కూడా చేయించడం లేదని దుయ్యబట్టారు. పట్టిసీమను పూర్తి చేసి సుమారు 13 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పారు.

ఆగిపోయిన ప్రాజెక్టులన్నింటినీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ప్రారంభిస్తామని దేవినేని ఉమా తెలిపారు. ప్రాజెక్టులపై తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు.

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద రామ్ గోపాల్ వర్మ షూటింగ్ చేయడంపై ఉమా అభ్యంతరం తెలిపారు. విమర్శించడానికి ఇప్పుడు వైసీపీకి ఏమీ లేకపోవడంతో... పట్టిసీమను టార్గెట్ చేశారని మండిపడ్డారు. పవిత్ర సంగమం వద్ద ఉమా ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News