నా అన్న కొడుకుతో సమావేశమైతే తప్పేంటి?: శరద్ పవార్ సూటి ప్రశ్న

  • శరద్ పవార్-అజిత్ పవార్ రహస్య సమావేశంతో ‘మహా’రాజకీయాల్లో కలకలం
  • ఈ సమావేశం గురించి శరద్ పవార్‌కు మీడియా ప్రశ్నలు
  • ఓ కుటుంబ పెద్ద ఇతర కుటుంబసభ్యులతో సమావేశమైతే తప్పేంటన్న శరద్ పవార్
ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ మధ్య జరిగిన రహస్య సమావేశం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఎన్సీపీని రెండుగా చీల్చీన అజిత్ పవార్ పలువురు ఎమ్మెల్యేలతో కలిసి అధికార శివసేన-బీజేపీ వర్గంలో చేరారు. అనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ మరింత బలహీనపడింది. 

ఈ నేపథ్యంలో, బాబాయ్-అబ్బాయ్ మళ్లీ రహస్యంగా సమావేశమయ్యారన్న వార్త రాష్ట్రంలో పెద్ద చర్చకే దారి తీసింది. నెక్ట్స్ ఏం జరగబోతోందా? అన్న ఉత్కంఠ మొదలైంది. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు శరద్ పవార్ వద్ద ఈ రహస్య సమావేశం ప్రస్తావన తెచ్చారు. 

‘‘అజిత్ నా అన్న కొడుకు..అతడితో సమావేశమైతే తప్పేంటి. ఓ కుటుంబ పెద్ద ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటే దాన్నో పెద్ద విషయంగా భావించాల్సిన అవసరం లేదు’’ అని శరద్ పవార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా, తమ పార్టీ బీజేపీకి మద్దతు పలకదని ఆయన తేల్చి చెప్పారు. కొందరు తన అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నా అది అసంభవమని వ్యాఖ్యానించారు.


More Telugu News