దళితులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ఉపేంద్ర.. నిరసనల వెల్లువతో క్షమాపణలు

  • తన పార్టీ ప్రజాకీయపై ఫేస్‌బుక్‌లో లైవ్ సెషన్ నిర్వహించిన ఉపేంద్ర
  • విమర్శకులపై అగ్గిమీద గుగ్గిలం, దళితుల్లా వారు ప్రతిచోటా ఉంటారని వివాదాస్పద వ్యాఖ్య
  • ఉపేంద్రపై భగ్గుమన్న దళిత సంఘాలు, వీధుల్లో నిరసనలు, ఉపేంద్ర పోస్టర్ల దగ్ధం
  • ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పిన నటుడు
  • పొరపాటున తన నోటి నుంచి ఈ కామెంట్ దొర్లిందని వివరణ
తన పార్టీ అభిమానులు, మద్దతుదారులతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా లైవ్ సెషన్ నిర్వహించిన కన్నడ నటుడు ఉపేంద్ర కాంట్రవర్సిలో చిక్కుకున్నారు. దళితులపై అభ్యంతరకర వ్యాఖ్య చేసిన ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు. ఓ వర్గాన్ని అవమానించారంటూ ఉపేంద్రపై పోలీసు కేసు కూడా నమోదైంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే, ఉపేంద్ర తన రాజకీయ పార్టీ ప్రజాకీయను విమర్శిస్తున్న వారిపై ఫేస్‌బుక్‌ సెషన్‌లో మండిపడ్డారు. ఈ సందర్భంగా అవమానకర రీతిలో దళితుల ప్రస్తావన తెచ్చారు. ‘‘నిష్కల్మషమైన హృదయాలతోనే మార్పు సాధ్యం. ఇలాంటి వారందరూ నా వెంట రావాలని, గొంతెత్తి తమ అభిప్రాయాలు వెల్లడించాలని కోరుకుంటున్నా. వారి సలహాలు మనకు మేలు చేస్తాయి. ఇలాంటి వాళ్లు ఇతరులను అవమానించరు. ఇష్టారీతిన మాట్లాడరు. కానీ కొందరు మాత్రం చాలా ఖాళీగా ఉంటారు. మనసుకు తోచింది వాగేస్తుంటారు. వాళ్ల గురించి మనమేం చేయలేము. ఓ టౌన్ ఉందంటే అక్కడ తప్పనిసరిగా దళితులు ఉన్నట్టు వీళ్లు కూడా ఉంటుంటారు. వాళ్ల గురించి మనం పట్టించుకోవద్దు. వాళ్ల కామెంట్స్‌ను చదవద్దు. ప్రజలపై ప్రేమాభిమానాలు కలిగి ఉండటమే నిజమైన దేశభక్తి’’ అని కామెంట్ చేశారు. ఇలా, ప్రతికూల వ్యాఖ్యలు చేసేవాళ్లను దళితులతో పోల్చి వివాదంలో చిక్కుకున్నారు. 

ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో వైరల్ కావడంతో ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రామనగర ప్రాంతంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. నిరసనకారులు ఉపేంద్ర పోస్టర్లను తగలబెట్టారు. ఈ క్రమంలోనే ఆయనపై చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. 

తనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఉపేంద్ర సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ‘‘లైవ్ సెషన్‌లో నేను ఈ రోజు పొరపాటున ఓ అభ్యంతరకర వ్యాఖ్య చేశాను. ఇది అనేక మంది మనసులను గాయపరిచిందని తెలియగానే వీడియోను డిలీట్ చేశాను. ఇలాంటి వ్యాఖ్య చేసినందుకు క్షమాపణ చెబుతున్నా’’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఓ పబ్లిక్ ఫిగర్‌గా ప్రజలను ప్రభావితం చేయగలిగే స్థితిలో ఉన్న ఉపేంద్ర తన మద్దతుదారులకు ఆదర్శప్రాయంగా నిలవాలని కొందరు కామెంట్ చేశారు.


More Telugu News