చిరంజీవి ఇల్లు ఎక్కడ కట్టారు?: పవన్‌కు గుడివాడ అమర్నాథ్ ప్రశ్న
- ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతుంటే ఇబ్బంది ఏంటన్న అమర్నాథ్
- రిషికొండపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపాటు
- గీతం యూనివర్సిటీ ఆక్రమణలు కనిపించలేదా? అని ప్రశ్న
- పవన్ ప్రసంగంలో విషయం ఉండదు కానీ విషం కక్కడమే ఉంటుందని విమర్శ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతుంటే ఆయనకేం ఇబ్బంది అని ప్రశ్నించారు. ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ ప్రసంగంలో విషయం ఉండదు కానీ విషం కక్కడం మాత్రమే ఉంటుందన్నారు
ఆదివారం ఉదయం మీడియాతో అమర్నాథ్ మాట్లాడుతూ.. గీతం కాలేజీ ఆక్రమణలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. రిషికొండకు వెళ్లిన పవన్.. ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసి ఉంటే గీతం కాలేజీ కనిపించేదని అన్నారు. చంద్రబాబు బంధువు భరత్ చేసిన 43 ఎకరాల భూకబ్జా ఆయనకు కనబడలేదా? అని ప్రశ్నించారు.
‘‘రిషికొండపై గతంలో ప్రభుత్వానికి చెందిన రిసార్ట్స్ ఉండేది. అక్కడ రిసార్ట్స్ మరమ్మతులకు గురి కావడంతో కొత్త భవనం నిర్మాణం జరుగుతోంది. పక్కనే ఉన్న రామానాయుడు స్టూడియో, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఐటీ హిల్స్, వెల్‌నెస్ సెంటర్లు వంటివన్నీ కొండలపైనే కట్టారు. వాటిని ఎందుకు తప్పు పట్టడం లేదు?” అని పవన్‌ను గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.
రామోజీ స్టూడియోను కొండలపై కట్టలేదా?జూబ్లీహిల్స్‌లో చిరంజీవి ఇల్లు ఎక్కడ కట్టారు? కొండ మీద కాదా? అని ప్రశ్నించారు. రిషికొండలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం కోసం అన్ని అనుమతులతో నిర్మాణం జరిగితే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.