రీల్స్ కోసం స్టీరింగ్ వదిలి కారెక్కిన యువకులు.. భారీ జరిమానాతో కొట్టిన పోలీసులు.. వైరల్ వీడియో ఇదే!

  • ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఘటన
  • ఖాళీ రోడ్డు కావడంతో తప్పిన ప్రమాదం
  • రూ. 23,500 జరిమానా విధించిన పోలీసులు
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఇద్దరు వ్యక్తులు చేసిన సాహసం భారీ జరిమానాకు కారణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఇద్దరు యువకులు కారు నడుస్తుండగా స్టీరింగ్ వదిలేసి దానిపైకెక్కి కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ‘ఎక్స్’లో  వైరల్ అయింది. 20 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో తొలుత ఇద్దరు యువకులు కారులో కూర్చున్నారు. ఆ తర్వాత కారు నడుస్తుండగా డోర్లు తీసి నెమ్మదిగా కారుపైకెక్కి కూర్చుని ప్రమాదకరంగా పోజిచ్చారు. 

ఈ వీడియో కాస్తా ఎక్స్‌ (ట్విట్టర్) లో వైర్ కావడంతో పోలీసులు స్పందించారు. రోడ్డుపై ప్రమాదకరంగా ఫీట్లు చేసినందుకు గాను రూ. 23,500 జరిమానా విధించారు. అయితే, ఈ ఫీట్ ఖాళీ రోడ్డుపై చేయడంతో ముప్పు తప్పింది. అదే రద్దీ రోడ్డుపై చేసి ఉంటే దాని పరిమాణాలు తీవ్రంగా ఉండేవని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, గతంలోనూ ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.


More Telugu News