ఒక్కసారిగా బరువు పెరగడం దేనికి సంకేతం...?

  • మనుషుల బరువులో తరచుగా హెచ్చుతగ్గులు
  • కొన్ని రోజుల వ్యవధిలోనే బరువు బాగా పెరిగితే తేలిగ్గా తీసుకోరాదన్న నిపుణులు
  • పలు రుగ్మతలు అకస్మాత్తుగా బరువు పెరగడానికి దారితీస్తాయని వెల్లడి
వయసు, అనారోగ్యం, తీసుకునే ఆహారం, హార్మోన్ల స్థాయులు, జీవనశైలి తదితర కారణాలతో వ్యక్తుల బరువులో తరచుగా హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. అయితే, ఒక్కసారిగా బరువు పెరిగినా, ఒక్కసారిగా బరువు తగ్గినా అది అనారోగ్య లక్షణంగా భావించాల్సి ఉంటుంది. కొన్నిరోజుల వ్యవధిలోనే బాగా బరువు పెరిగినట్టు అనిపిస్తే అది ఆలోచించాల్సిన అంశమేనని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా బరువు పెరగడానికి కొన్ని శారీరక రుగ్మతలు కారణమవుతాయని అంటున్నారు. 

1. హైపో థైరాయిడిజం
థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తే దాన్ని హైపో థైరాయిడిజంగా భావిస్తారు. హైపో థైరాయిడిజం వల్ల జీవక్రియలు కుంటుపడతాయి. దాంతో శరీరంలో ద్రవ పదార్థాల శాతం పెరిగిపోతుంది. శరీరంలో ద్రవాల శాతాన్ని అదుపులో ఉంచే థైరాయిడ్ హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది. దాంతో శరీర బరువు ఒక్కసారిగా పెరిగిపోతుంది.

2. కాలేయం, కిడ్నీలు, హృదయ సంబంధ వ్యాధులు
హైపోథైరాయిడిజం తరహాలోనే... శరీరంలో అత్యంత కీలక అవయవాలైన గుండె, కిడ్నీలు, కాలేయం వైఫల్యం చెందినా ద్రవాలు పేరుకుపోతాయి. తద్వారా శరీర బరువు పెరగడానికి ఈ పరిస్థితి దారితీస్తుంది. శరీర బరువులో అకస్మాత్తుగా తేడా వస్తే కాలేయం, కిడ్నీలు, హృదయ సంబంధ వ్యాధులేమైనా ఉన్నాయేమో పరీక్షలు చేయించుకోవడం మంచిది.

3. కుషింగ్స్ సిండ్రోమ్ (cushing's Syndrome)
మానవ దేహంలో జీవక్రియలను నియంత్రించే హార్మోన్లలో కార్టిసాల్ ఒకటి. శరీరం ఈ కార్టిసాల్ హార్మోన్ ను అడ్డుఅదుపు లేకుండా ఉత్పత్తి చేసే పరిస్థితినే కుషింగ్స్ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా బరువు పెరుగుదలకు ఓ కారణమే. కుషింగ్స్ సిండ్రోమ్ తో బాధపడేవారిలో వీపు పైభాగం, ఉదరం, ముఖం వంటి భాగాలు ఉబ్బినట్టుగా అనిపిస్తాయి.

4. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)
ఇది మహిళల్లో చాలామందిలో కనిపించే సిండ్రోమ్. పీసీఓఎస్ ను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. శరీరంలో ఇన్సులిన్ వ్యతిరేకత ఏర్పడడం, హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఈ సిండ్రోమ్ లక్షణాలు. పీసీఓఎస్ బాధితుల్లో అధిక సంఖ్యలో అండాలు విడుదలవడం ఒక్కసారిగా బరువు పెరగడానికి దారితీస్తుంది.


More Telugu News