బాలికపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

  • తిరుమల అలిపిరి నడకమార్గంలో విషాద ఘటన
  • బాలికపై దాడి చేసి తినేసిన చిరుత
  • నరసింహస్వామి ఆలయం వెనుకభాగంలో బాలిక మృతదేహం
  • కాలినడకన వచ్చే భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్న భూమన
శుక్రవారం రాత్రి తిరుమల అలిపిరి నడకమార్గంలో లక్షిత (6) అనే బాలికపై చిరుత దాడి చేయడం తెలిసిందే. లక్షిత మృతదేహం ఈ ఉదయం లభ్యం కావడంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

కాగా, టీటీడీ నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి... లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతాన్ని ఈ మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల కొండపైకి కాలినడకన వచ్చే భక్తులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. 

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన దినేశ్, శశికళ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి మార్గంలో కాలినడకన బయల్దేరింది. బాలిక లక్షిత ముందు నడస్తుండగా, చిరుత ఒక్కసారిగా దాడి చేసి బాలికను నోటకరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. లక్షిత మృతదేహం ఈ ఉదయం నరసింహస్వామి ఆలయం వెనుక భాగంలో కనిపించింది. 

తొలుత, బాలికపై దాడి చేసింది ఎలుగుబంటి అని భావించినప్పటికీ, పోస్టుమార్టం రిపోర్టులో చిరుత దాడిలోనే మృతి చెందినట్టు తేలింది.


More Telugu News