ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుతో పాటు మరో మూడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర
- చట్టరూపం దాల్చిన నాలుగు బిల్లులు
- కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయిన ఢిల్లీ అధికారుల నియామకాలు, బదిలీలు
- ఢిల్లీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు
ఢిల్లీ సర్వీసుల బిల్లు చట్టరూపం దాల్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు లోక్ సభ, రాజ్యసభ ఆమోదం పొందింది. తాజాగా దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాల్చింది. బిల్లు చట్టరూపం దాల్చడంతో ఇకపై ఢిల్లీలో ఐఏఎస్, ఐపీఎస్ లు సహా ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలపై నియంత్రణ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఢిల్లీ బిల్లుతో పాటు మరో మూడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వీటిలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన మరణాల రిజిస్ట్రేషన్ బిల్లు, జన విశ్వాస్ బిల్లు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే అధికారపక్షానికి ఎక్కువ మెజార్టీ ఉండటంతో బిల్లులు పాసయ్యాయి.