బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు వర్షాలు!

  • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్న ఐఎండీ
  • హైదరాబాద్ సహా ఏపీ, తెలంగాణలలో పలుచోట్ల శనివారం చిరుజల్లులు
  • ఈ నెల 15 తర్వాత ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో దేశవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో శనివారం ఉదయం చిరుజల్లులు కురిశాయని చెప్పారు. ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు, ఏపీలోని కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని వివరించారు.

ఉపరితల ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, విదర్భ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు, తెలంగాణ, బెంగాల్, ఒడిశా, కొంకణ్, గోవా, కోస్టల్ కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శని, ఆది వారాల్లో..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సోమవారం..
ఏపీలోని ఒకటీ రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గాలిలో వేడి, తేమ కారణంగా వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.


More Telugu News