డాక్టర్ రాధ హత్య కేసులో భర్తే హంతకుడు.. రూ. 25 కోట్ల ఆస్తి కోసం 60 ఏళ్ల వయసులో ఘాతుకం

  • మచిలీపట్టణంలో సంచలనం సృష్టించిన రాధ హత్య
  • డ్రైవర్ సాయంతో ఘాతుకానికి ఒడిగట్టిన భర్త
  • దొంగతనంగా నమ్మించేందుకు నగలు తీసేసిన వైనం
  • భర్త, డ్రైవర్ అరెస్ట్
కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో సంచలనం సృష్టించిన డాక్టర్ మాచర్ల రాధ హత్యకేసు మిస్టరీ వీడింది. పిల్లల వైద్య నిపుణుడైన ఆమె భర్త లోక్‌నాథ్ మహేశ్వరరావే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. దీంతో ఆయనతోపాటు హత్యకు సహకరించిన కారు డ్రైవర్ మధును కూడా అదుపులోకి తీసుకున్నారు. 

రూ. 25 కోట్ల విలువైన ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాలే ఆమె హత్యకు కారణమని తేల్చారు. 60 ఏళ్లు దాటిన మహేశ్వరరావు ఆస్తులపై మమకారంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. 15 ఏళ్లుగా తన వద్ద నమ్మకంగా డ్రైవర్‌గా, అటెండర్‌గా పనిచేస్తున్న మధుకు బంగారం, నగదు ఆశ చూపి హత్యకు ఒప్పించాడు. అనంతరం పక్కా ప్రణాళిక ప్రకారం గత నెల 25న రాధను అంతమొందించారు. రెండో అంతస్తులో ఒంటరిగా ఉన్న రాధ వద్దకు డ్రైవర్ మధుతో కలిసి భర్త లోక్‌నాథ్ వెళ్లాడు. మధు ఆమెను పట్టుకోగా భర్త ఆమె తల వెనక నుంచి ఆయుధంతో దాడిచేసి చంపేశాడు. పోలీసు జాగిలాలకు దొరక్కుండా మధు ఆ ప్రదేశం మొత్తం కారం చల్లాడు. 

ఆ తర్వాత ఇంట్లో దొంగతనం జరిగిందని నమ్మించేందుకు ఆమె నగలు తీసేశారు. ఏమీ ఎరగనట్టు కింది అంతస్తులోని ఆసుపత్రికి వచ్చి రోగులను చూశాడు. రాత్రి 10.30కి తీరిగ్గా పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, భార్య చనిపోయిందన్న బాధ ఆయనలో ఇసుమంతైనా కనిపించకపోవడంతో అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు జరపడంతో అసలు విషయం బయటపడింది.


More Telugu News