రుణాలు భవిష్యత్తుకు పెట్టుబడి: మొహాలీ ఐఎస్‌బీ సమావేశంలో మంత్రి కేటీఆర్

  • ప్రజాక్షేత్రంలో గెలవడం యూపీఎస్సీ పరీక్ష కంటే కఠినమని వ్యాఖ్య
  • శాంతిభద్రతలను కాపాడటం భవిష్యత్తు ప్రభుత్వాలకు మరింత సవాల్ అన్న కేటీఆర్
  • తెలంగాణ ఉద్యమం వల్ల క్షేత్రస్థాయిలో పని చేసే అవకాశం తనకు లభించిందన్న మంత్రి
ప్రజాక్షేత్రంలో గెలవడం యూపీఎస్సీ పరీక్ష కంటే కఠినమైదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మొహాలీ ఐఎస్‌బీ క్యాంపస్‌లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... దేశంలో విభజన రాజకీయాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంచి రాజకీయ చర్చలు ఉంటాయనుకోవడం వాస్తవ దూరమే అన్నారు. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటం భవిష్యత్తులో ప్రభుత్వాలకు మరింత సవాల్ అన్నారు. రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవడం సవాలే అన్నారు. విభిన్న రంగాల్లో అనుభవం కలిగిన వారు రాజకీయాల్లోకి రావాలని చెప్పారు. తాను వారసత్వంగా వచ్చినప్పటికీ తెలంగాణ ఉద్యమం వల్ల క్షేత్రస్థాయిలో పని చేసే అవకాశం లభించిందన్నారు.

దేశంలోనే తెలంగాణ విజయవంతమైన రాష్ట్రం అన్నారు. రాజకీయ నాయకత్వానికి చిత్తశుద్ధి, విజన్ ఉంటే ప్రగతి, పాలనలో విజయాలు సాధ్యమన్నారు. తెలంగాణ మోడల్ ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు సవాల్‌తో కూడుకున్నవే అన్నారు. మౌలిక వసతులపై పెట్టే ప్రతి పైసా పెట్టుబడి భవిష్యత్తుకు భరోసా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో యాభై శాతం త్వరలో తెలంగాణ ఉత్పత్తి చేయనుందన్నారు. అభివృద్ధి కోసం రుణాలు తీసుకోకూడదనే పాత ధోరణి వల్ల భారత్ ప్రగతి పథంలో ముందుకు సాగడం లేదన్నారు. అన్ని దేశాలు రుణాలను పెట్టుబడిగా చూస్తుంటే, భారత్‌లో అలాంటి ఆలోచన లేదన్నారు.


More Telugu News