ఆ భావన లేకుండా హగ్ చేసుకుంటే నేరం కాదు: రెజ్లింగ్ సమాఖ్య చీఫ్
- రెజ్లింగ్ లో ఆటగాళ్లను హగ్ చేసుకోవడం సర్వసాధారణమే
- ఎక్కువ మంది పురుష కోచ్ లు ఉన్నారంటూ కోర్టు ముందు వాదనలు
- ఆలస్యంగా ఫిర్యాదు దాఖలుకు కారణం సహేతుకంగా లేదన్న న్యాయవాది
తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో రెజ్లింగ్ సమాఖ్య చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ బూషణ్ శరణ్ సింగ్ కోర్టులో తనను కాపాడుకునే వాదన వినిపించారు. మహిళను హత్తుకోవడం, తాకడం అనేవి మనసులో ఎలాంటి నేర ప్రవృత్తి లేకుండా, లైంగిక పరమైన భావనతో కాకుండా చేస్తే అది నేరం కాదని పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ తరఫున న్యాయవాది రాజీవ్ మోహన్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించారు.
‘‘తమ కెరీర్ విషయంలో ఆందోళన వల్లే తాము ఐదేళ్ల పాటు ఫిర్యాదు చేయలేదని రెజ్లర్లు చెబుతున్నారు. ఫిర్యాదు దాఖలులో ఆలస్యానికి ఇది తగిన కారణం కాదు. మహిళా రెజ్లర్లను పురుష కోచ్ లు హగ్ చేసుకోవడం సాధారణమే. ఎక్కువ మంది పురుష కోచ్ లే ఉన్న విషయం వాస్తవం. మహిళా కోచ్ లు చాలా అరుదు. కనుక పురుష కోచ్ మంచి భావనతో హగ్ చేసుకోవడం సర్వసాధారణమే. మనం టీవీల్లో కూడా చూస్తున్నాం. మహిళా కోచ్ లే మహిళా ప్లేయర్లను హగ్ చేసుకోవాలని లేదు’’అని న్యాయస్థానం ముందు సమర్థనీయ వాదనలు వినిపించారు. ఈ కేసులో విచారణను కోర్టు వాయిదా వేసింది.