కడపలో దంచికొట్టిన వాన.. జలమయంగా మారిన రోడ్లు.. వీడియో ఇదిగో!

  • తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షం
  • రోడ్లపై మోకాళ్ల లోతు వరద.. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు
  • మొరాయించిన వాహనాలు.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్
కడపలో గురువారం వర్షం దంచికొట్టింది. తెల్లవారుజామున మొదలైన వాన ఉదయం వరకూ  ఏకధాటిగా కురిసింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయంపూట స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులతో పాటు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు. వరద కారణంగా వాహనాలు రోడ్లపైనే మొరాయించడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ తో పాటు అంబేడ్కర్ చౌరస్తా, కో్ర్టు రోడ్, భరత్ నగర్, చైన్నై రోడ్, మృత్యుంజయ కుంట, గంజికుంట కాలనీ, అక్కయ్యపల్లి, ప్రకాశ్ నగర్ తదితర ఏరియాలలోకి నీరు చేరింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈ వరద నీటిని తొలగించేందుకు నగరపాలక అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అక్కయ్యపాలెంలో పాత గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


More Telugu News