జైలర్ సినిమా చూసేందుకు జపాన్ నుంచి విచ్చేసిన జంట

  • ఒసాకా పట్టణానికి చెందిన హోటల్ మేనేజర్ కు రజనీ అంటే ఎంతో అభిమానం
  • గతంలోనూ పలు సందర్భాల్లో చెన్నైకి విచ్చేసిన జంట
  • తలైవర్ ను మరోసారి పెద్ద స్క్రీన్ పై చూడనున్నట్టు ప్రకటన
తమిళ అగ్ర నటుడు రజనీకాంత్ కు జపాన్ లోనూ అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఆయన సినిమా విడుదల అయితే జపాన్ బాక్సాఫీసులు సైతం కళకళలాడతాయి. జైలర్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ క్రమంలో జపాన్ లోని ఒసాకా పట్టణానికి చెందిన ఓ జంట రజనీకాంత్ జైలర్ మూవీ చూసేందుకు ఫ్లయిట్ ఎక్కి చెన్నైకి చేరుకుంది. అంతదూరం ప్రయాణించడం వెనుక కారణం ఏంటా? అని ఆరా తీయగా.. అభిమానుల మధ్య రజనీకాంత్ సినిమాని ఆయన రాష్ట్రంలోనే చూడాలని అనుకుని వచ్చారట. 

యుసుదా హిడెతోషి, ఆయన భార్య భారత్ కు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ వారు రజనీకాంత్ సినిమాలు చూసేందుకు పలు సందర్భాలలో వచ్చినట్టు చెప్పారు. ఇక మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జపాన్ లో రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ నాయకుడిగానూ హిడెతోషి వ్యవహరిస్తున్నారు. జైలర్ టీ షర్ట్ వేసుకున్న హిడెతోషి చెన్నైకి బుధవారమే చేరుకున్నారు.

విడుదలకు ముందు రోజు వారు చెన్నైలోని ఆల్బర్ట్ థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘కాశీ థియేటర్, ఆల్బర్ట్ థియేటర్ లో తోటి అభిమానులతో కలసి సినిమా చూడనున్నాం. పెద్ద స్క్రీన్ పై మా తలైవర్ ను మరోసారి చూసేందుకు ఇంకా ఓపిక పట్టలేం’’ అని హోటల్ మేనేజర్ గా పనిచేసే హిడెతోషి పేర్కొన్నారు.


More Telugu News