ప్రపంచ కప్ పనుల్లో అపశ్రుతి.. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో అగ్ని ప్రమాదం

  • డ్రెస్సింగ్ రూమ్‌లో చెలరేగిన మంటలు
  • రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి 
    తెచ్చిన సిబ్బంది
  • ప్రపంచ కప్ కోసం స్టేడియంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులు
కోల్‌కతాలోని ప్రఖ్యాత క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి డ్రెస్సింగ్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. వన్డే ప్రపంచకప్ కి ముందు స్టేడియంలో నిర్వహిస్తున్న పునరుద్ధరణ పనుల్లో ఈ ఘటన జరిగింది. అక్కడ పని చేస్తున్న వారు మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్రికెటర్ల సామగ్రి ఉంచిన డ్రెస్సింగ్ రూమ్‌లోని ఫాల్స్ సీలింగ్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. నష్టం పెద్దగా లేకున్నా, అక్కడున్న ఆటగాళ్ల సామాన్లన్నీ కాలిపోయాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాద ఘటన స్టేడియంలో పునరుద్ధరణ పనులను ప్రశ్నార్థకం చేసింది. 

ప్రపంచ కప్‌ సమీపిస్తుండటంతో ప్రస్తుతం స్టేడియంలో పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. సెప్టెంబరు 15 నాటికి పునరుద్ధరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల పురోగతిపై ఇటీవల ఐసీసీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ వచ్చే నెలలో మరోసారి పరిశీలనకు రానున్నారు. ఈ సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో అగ్నిప్రమాదం జరగడం కొత్త సమస్యలను సృష్టించింది. స్టేడియంలో ఏ మ్యాచ్‌కైనా ఫైర్ పర్మిట్ తప్పనిసరి. ప్రపంచకప్ నిర్వహణలో కూడా ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. దాంతో, స్టేడియంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నారు.


More Telugu News