అవిశ్వాసంపై చర్చలో నేడు సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీ

  • ‘అవిశ్వాసం’పై పార్లమెంటులో వాడీవేడి చర్చ
  • నేడు ప్రధాని సమాధానం ఇస్తారన్న రాజ్‌నాథ్ సింగ్
  • మణిపూర్‌పై మోదీని మాట్లాడించడమే ‘ఇండియా’ లక్ష్యం
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ పార్లమెంటులో వాడీవేడిగా జరుగుతోంది. చర్చలో భాగంగా నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సభలో వేడిపుట్టించాయి. మూడో రోజైన నేటి మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ ఈ చర్చకు సమాధానమివ్వనున్నారు. 

జాతుల మధ్య ఘర్షణలతో దాదాపు మూడు నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్ సమస్యపై మోదీ మాట్లాడాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించింది. మొన్న, నిన్న కూడా దీనిపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం ప్రధాని మోదీ సభకు సమాధానం ఇవ్వనున్నట్టు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నిన్న తెలియజేశారు. 

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ.. మోదీ మౌనవ్రతాన్ని భంగం చేసేందుకే తీర్మానం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. నిన్న అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమిపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష సభ్యులకు కుటుంబ సభ్యులు తప్ప రైతులు, పేదలు, వెనుకబడిన వర్గాలవారు పట్టరని మండిపడ్డారు. 

అవిశ్వాస తీర్మానం గెలవాలంటే కనీసం 272 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా, ప్రభుత్వానికి మాత్రం దాదాపు 331 మంది ఎంపీల మద్దతు ఉంది. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి ఉన్నది 144 మందే. బీఆర్ఎస్ ఎంపీలు కూడా అవిశ్వాసానికి మద్దతిస్తే ఆ సంఖ్య 152కు చేరుతుంది. అవిశ్వాస తీర్మానంలో గెలిచే అవకాశం లేకున్నా మణిపూర్ సమస్యపై మోదీని మాట్లాడించడం ద్వారా తాము విజయం సాధించామని చెప్పుకోవడానికే ఇలా చేస్తున్నట్టు ‘ఇండియా’ సమర్థించుకుంటోంది.


More Telugu News