కోళ్ల ఫారంతో ఈగల బెడద.. వాటర్ ట్యాంక్ ఎక్కి గ్రామస్తుల నిరసన!

  • ఉత్తరప్రదేశ్ హర్దోయీ జిల్లా కుయ్యీ గ్రామంలో ఘటన
  • సమస్య పరిష్కారం కోసం అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని గ్రామస్తుల ఆగ్రహం
  • పెళ్లిళ్లు జరగట్లేదని, కొత్త కోడళ్లు గ్రామాన్ని వీడి వెళ్లిపోతున్నారని ఆవేదన
  • సమస్య పరిష్కరిస్తామన్న అధికారుల హామీతో నిరసన విరమణ
ఈగల బెడదతో సతమతమవుతున్న గ్రామస్తులు కొందరు అధికారులు తమ సమస్యను తీర్చాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి మరీ నిరసన తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లా కుయ్య గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. 

గ్రామంలోని ఓ కోళ్ల ఫారం కారణంగా అక్కడ ఈగల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని గ్రామస్తులు వాపోయారు. పెళ్లిళ్లు జరగడం లేదని, చుట్టుపక్కల రాకడ కూడా నిలిచిపోయిందని ఫిర్యాదు చేశారు. కొత్త కోడళ్లు గ్రామంలో ఉండటం ఇష్టం లేక వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. 

అధికారులకు తాము పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లో తాము ఇలా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగినట్టు వెల్లడించారు. కాగా, నిరసన గురించి తెలిసి అక్కడికి చేరుకున్న అధికారులు వారితో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, గ్రామస్తులు ఆందోళన విరమించారు.


More Telugu News