రాష్ట్రాభివృద్దికి నా సేవలు అవసరమో, లేదో గుర్తించండి: పార్వతీపురంలో చంద్రబాబు

రాష్ట్రాభివృద్దికి నా సేవలు అవసరమో, లేదో గుర్తించండి: పార్వతీపురంలో చంద్రబాబు
  • పార్వతీపురంలో చంద్రబాబు రోడ్ షో... సభ
  • వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని వ్యాఖ్య 
  • టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి
  • జగన్ ను చిత్తుగా ఓడించి వైసీపీని భూస్థాపితం చేయాలని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లా పార్వతీపురంలో రోడ్ షో, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటా అని వెల్లడించారు. సోలార్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి యూనిట్ విద్యుత్ రూ.3కే అందిస్తామని తెలిపారు. 

వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని, టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ రాకతో ప్రజల భవిష్యత్తు అంధకారంగా మారిందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి నా సేవలు అవసరమో, కాదో గుర్తించండి... జగన్ ను చిత్తుగా ఓడించి వైసీపీని భూస్థాపితం చేయండి అని పిలుపునిచ్చారు. 

తనపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అరాచకాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి రండి... నేను అండగా ఉంటానని భరోసానిచ్చారు. జగన్ ను భరించే స్థితిలో రాష్ట్రం లేదని చంద్రబాబు అన్నారు. 

పోలీసులు అందరూ చెడ్డవారు కారని, అవినీతి పోలీసు అధికారులపైనే తమ పోరాటం అని వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


More Telugu News