రేపల్లె రైల్వేస్టేషన్ సామూహిక అత్యాచార దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష

  • గతేడాది ఘటన
  • కూలి పనుల కోసం వచ్చిన వలస కార్మికులు
  • భర్తను కొట్టి, భార్యపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు కామాంధులు
  • ముగ్గురినీ అరెస్ట చేసిన పోలీసులు... నిందితుల్లో ఒకరు మైనర్
గతేడాది రేపల్లె రైల్వేస్టేషన్ లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరగడం తెలిసిందే. కూలి పనుల కోసం వచ్చిన వలస కార్మికులు రైల్వే స్టేషన్ లో నిద్రిస్తుండగా, భర్తను కొట్టిన కామాంధులు... మహిళను ప్లాట్ ఫాం చివరికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసులో నేడు తీర్పు వెలువడింది. దోషులకు గుంటూరు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 

2022 మే 1న అత్యాచార ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురినీ అరెస్ట్ చేశారు. 

ఈ కేసుకు సంబంధించి గుంటూరు 4వ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. నిందితులు నేరానికి పాల్పడినట్టు ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలతో నిర్ధారణ అయింది. ఈ కేసులో ఏ1, ఏ2కు జైలుశిక్ష విధించారు. ఏ3 మైనర్ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది.


More Telugu News