2019లో రూ.150 కోట్లకు కొన్న కంపెనీ.. ఇప్పుడు రూ.1,479 కోట్లకు విక్రయం

  • చైతన్య ఇండియా ఫిన్ రూ.1,479 కోట్లకు విక్రయం
  • ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ మరో విజయగాథ 
  • కుమార మంగళం బిర్లా కుమార్తె కంపెనీతో డీల్
సామాన్యులు ఒక రూ.లక్ష పొదుపు చేసుకుని, దాన్ని రూ.2 లక్షలు చేసుకోవాలంటే ఎన్నో ఏళ్లు ఓపిక పట్టాలి. అదే ఐశ్వర్యవంతుల విషయానికి వస్తే వారు తమ సంపదను వేగంగా రెట్టింపు చేసుకోగలరు. సామాన్యులకు, సంపద పరులకు ఉన్న వ్యత్యాసం అదే. సచిన్ బన్సల్ గురించి తెలిసే ఉంటుంది. సచిన్ బన్సల్ కంటే, ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు అని చెబితే ఎక్కువ మంది గుర్తు పడతారు. ఫ్లిప్ కార్ట్ లో తన వాటాలను వాల్ మార్ట్ కు విక్రయించిన తర్వాత సచిన్ బన్సల్.. నవీ ఫిన్ సర్వ్ పేరుతో ఒక డిజిటల్ ఎన్ బీఎఫ్ సీ సంస్థను స్థాపించారు. తన వ్యాపార విస్తరణలో భాగంగా చైతన్య ఇండియా ఫిన్ ను రూ.150 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది 2019లో జరిగింది. 

సరిగ్గా నాలుగేళ్లు పూర్తయిందో లేదో కానీ.. తాజాగా చైతన్య ఇండియా ఫిన్ ను రూ.1,479 కోట్లకు విక్రయించడానికి సచిన్ బన్సల్ డీల్ కుదుర్చుకున్నారు. ఆదిత్య గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లాకు చెందిన, స్వతంత్ర మైక్రోఫిన్ కంపెనీ ఇంత మొత్తం పెట్టి దీనిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ కొనుగోలుతో సూక్ష్మ రుణాల రంగంలో స్వతంత్ర మైక్రోఫిన్ రెండో అతిపెద్ద సంస్థగా అవతరిస్తుంది. నాలుగేళ్లలో చైతన్య మైక్రో ఫిన్ ఆరు రెట్లు వృద్ధి చెందినట్టు సచిన్ బన్సల్ ప్రకటించారు. కానీ, విక్రయించినది మాత్రం కొనుగోలు ధరపై 10 రెట్లుగా ఉండడం గమనించొచ్చు. ఫ్లిప్ కార్ట్ లో భారీ లాభాలను పోగేసుకున్న బన్సల్, ఇపుడు ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలోనూ కాసులు కురిపించుకుంటున్నారు.


More Telugu News