బ్రిటీష్ వాళ్లకన్నా దారుణంగా పాలిస్తున్నారు.. జగన్ పై లోకేశ్ ఫైర్

  • క్విట్ సైకో జగన్.. సేవ్ ఏపీ అంటూ నినదించిన యువనేత
  • పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశాడంటూ ట్వీట్
  • జూలకల్లులో కొనసాగుతున్న యువగళం పాదయాత్ర
భారతదేశంలో బ్రిటీష్ పాలన కంటే దారుణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పాలన కొనసాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1942లో ఇదే రోజున ‘క్విట్ ఇండియా’ అని నినదించిన ప్రజలపై బ్రిటీష్ సైనికులు విరుచుకుపడ్డారని చెప్పారు. నినాదాలు చేసిన వారందరినీ జైళ్లలో కుక్కారని గుర్తుచేస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఏపీలోనూ ఇదేరకమైన పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ‘క్విట్ సైకో జగన్ - సేవ్ ఏపీ’ అని నినదించాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. 

యువగళం పాదయాత్రలో భాగంగా 178 వ రోజు జూలకల్లు నుంచి నారా లోకేశ్ యాత్ర ప్రారంభించారు. దారిపొడవునా అక్కాచెల్లెమ్మలు తనకు అపూర్వ రీతిలో స్వాగతం పలికారని, హారతులతో అభిమానం చాటుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జూలకల్లు గ్రామస్థులు నారా లోకేశ్ కు వినతిపత్రం అందించారు. నిర్వహణలోపంతో నాగార్జున సాగర్ కుడికాలువ గేట్లు శిథిలావస్థకు చేరిన వైనాన్ని సెల్ఫీ చాలెంజ్ ద్వారా లోకేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనను కలిసిన జూలకల్లు, పిడుగురాళ్ల, గురజాల ప్రజలకు లోకేశ్ ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం పిడుగురాళ్లలో జరిగిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు.


More Telugu News