పాక్ ప్రధాని పదవి నుంచి నేడు తప్పుకోనున్న షేబాజ్ షరీఫ్

  • పాక్‌లో ఈ ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలు
  • జాతీయ అసెంబ్లీని నేడు రద్దు చేసే అవకాశం
  • నిన్న ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన షేబాజ్
పాకిస్థాన్‌లో ఈ ఏడాది చివర్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అదనపు సమయం పొందేందుకు పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా షేబాజ్ నేడు పదవి నుంచి తప్పుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంటు దిగువసభ పదవీకాలం మరో మూడు రోజుల్లో (12న) ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నేడే దానిని రద్దు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

ఈ మేరకు అధ్యక్షుడు అరిఫ్ అల్వీ (ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి చెందినా మాజీ సభ్యుడు)కి షేబాజ్ సమాచారం పంపనున్నారు. ఆయన కనుక ఈ విషయంలో నిర్ణయం తీసుకోని పక్షంలో ప్రధాని సలహా మేరకు అసెంబ్లీ 48 గంటల్లో రద్దు అవుతుంది. ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్న షరీఫ్ నిన్న రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. అక్కడాయనకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ ఘన స్వాగతం పలికారు. షేబాజ్ నేడు రాజీనామా చేసినా ఆయన సారథ్యంలోని ముస్లిం లీగ్ నవాజ్ సంకీర్ణ ప్రభుత్వం మరో రెండు రోజులు అంటే 11వ తేదీ వరకు అధికారంలో ఉండే అవకాశం ఉంది.


More Telugu News