తండ్రి మరణంతో నిద్ర విలువ తెలిసొచ్చిందన్న బిల్ గేట్స్!

  • ఒకప్పుడు నిద్ర అంటే బద్ధకస్తుల లక్షణమని భావించేవాడినన్న బిల్ గేట్స్
  • అప్పట్లో ప్రజల్లో నిద్రపై అలాంటి భావన ఉండేదని వ్యాఖ్య
  • తన తండ్రి అల్జీమర్స్ తో మరణించాక నిద్ర విలువ తెలిసిందని వెల్లడి
  • ప్రస్తుతం తాను రోజుకు ఎనిమిది గంటలు నిద్రించేందుకు ప్రయత్నిస్తానన్న గేట్స్
మైక్రోసాఫ్ట్ స్థాపించిన తొలినాళ్లలో తాను వీలైనంత తక్కువగా నిద్రపోయేవాడినని సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా పేర్కొన్నారు. నిద్ర అనవసరమని, బద్ధకస్తుల లక్షణమని భావించేవాడినని చెప్పుకొచ్చారు. అయితే, తన తండ్రి అల్జీమర్స్ తో మరణించాక నిద్ర విలువ గురించి తెలుసుకున్నానని వివరించారు. 

‘‘అప్పట్లో నేను 30, 40ల్లో ఉన్నప్పుడు నిద్ర ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నా తోటి వారు, తాము ఆరు లేదా అయిదు గంటలే నిద్రపోయామని గొప్పగా చెప్పుకునేవారు. కొందరు తాము నిద్రే పోలేదని అనేవారు. వాళ్లను చూసి ఆశ్చర్యపోయేవాడిని! నిద్ర తగ్గించి మరింతగా కష్టపడాలని అనుకునే వాడిని’’ అని చెప్పుకొచ్చారు. కానీ అల్జీమర్స్ వ్యాధి బారిన పడి తన తండ్రి 2020లో మరణించాక నిద్రపై తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఆ తరువాత తాను రోజుకు ఎన్ని గంటలు నిద్రపోయిందీ లెక్క రాసుకుంటూ ఓ స్లీప్ స్కోర్ నిర్వహించడం మొదలెట్టానని అన్నారు. 

‘‘మెదడు ఆరోగ్యం కోసం నిద్ర ఎంత అవసరమో ఇప్పుడు మనకు తెలిసింది. టీనేజ్ వయసు నుంచీ కూడా శరీరానికి సరిపడా నిద్రపోవడం చాలా కీలకం. అల్జీమర్స్ వ్యాధి లాంటి మతిమరుపు సమస్యల బారినపడతామా లేదా అనేది రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంది’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం తాను రోజుకు 7 నుంచి 8 గంటల నిద్రకు ప్రయత్నిస్తానని చెప్పారు.


More Telugu News