ప్రత్యేక హోదా గురించి ఆలోచించండి.. సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి?: చిరంజీవి ఘాటు విమర్శలు
- పేదల కడుపు నింపే పథకాలపై దృష్టి పెట్టాలన్న చిరంజీవి
- రోడ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాల గురించి ఆలోచించాలని హితవు
- అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారని వ్యాఖ్య
- పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ ఇండస్ట్రీపై పడతారేంటని మండిపాటు
రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మీ లాంటి వాళ్లు’ అంటూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వానికి చురకలంటించారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంగా సినీ పరిశ్రమపై పడ్డారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కడుపు నింపే పథకాలపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మీ లాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం గురించి, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి. పేద వారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేకానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ ఇండస్ట్రీపై పడతారేంటి?” అని మండిపడ్డారు.
2014 తర్వాతి నుంచి కేవలం సినిమాలకు మాత్రమే చిరంజీవి పరిమితమయ్యారు. రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇటీవల ‘బ్రో’ సినిమా విషయంలో జరిగిన పలు ఘటనల నేపథ్యంలోనే చిరంజీవి ఇలా స్పందించినట్లుగా చర్చ జరుగుతోంది.