ఢిల్లీ మంత్రి అతిషికి ఏకంగా 14 శాఖలను కట్టబెట్టిన సీఎం కేజ్రీవాల్‌

  • తన క్యాబినెట్‌ను పునర్వ్యవస్థీకరించిన అరవింద్ కేజ్రీవాల్
  • ఢిల్లీ సేవల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన
     తర్వాతి రోజే అనూహ్య నిర్ణయం
  • దేశ రాజధాని బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించనున్న ఢిల్లీ సేవల బిల్లు
దేశ రాజధాని బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించే ‘ఢిల్లీ సేవల బిల్లు’ పార్లమెంటు ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి వర్గాన్ని మంగళవారం పునర్వ్యవస్థీకరించారు. అనూహ్యంగా మంత్రివర్గంలో మార్పులు చేయడం చర్చనీయాంశమైంది. సర్వీస్‌, విజిలెన్స్‌ శాఖల బాధ్యతలను పబ్లిక్‌ వర్క్స్‌ శాఖ మంత్రి అతిషికి అప్పగించారు. ఇదివరకు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ రెండు పోర్ట్‌ఫోలియోలకు నాయకత్వం వహించారు. మంత్రివర్గ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపారు. 

ఢిల్లీ క్యాబినెట్‌లో ఏకైక మహిళా మంత్రి అయిన అతిషి వద్ద ఇప్పుడు ఏకంగా 14 పోర్ట్‌ఫోలియోలు ఉన్నాయి. ఇందులో కీలకమైన విద్య, విద్యుత్ శాఖలు ఉన్నాయి. అతిషి కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనీలాండరింగ్ కేసుల్లో జైలులో ఉన్న మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామాలు చేయడంతో సౌరభ్ భరద్వాజ్, అతిషి ఈ ఏడాది మార్చిలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.


More Telugu News