అవిశ్వాసంపై చర్చను రాహుల్ ఎందుకు ప్రారంభించలేదు? మేం వెయిటింగ్ సర్: కేంద్ర మంత్రి జోషి ఎద్దేవా
- లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలు
- చర్చను రాహుల్ ప్రారంభిస్తారని లేఖ ఇచ్చారన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
- మరి ఐదు నిమిషాల్లోనే ఏమైంది సర్? అంటూ ప్రశ్న
- ఆయన ఏం చెబుతారోనని వెయిటింగ్ అంటూ సెటైర్లు
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ ఈ మేరకు చర్చను ప్రారంభించాల్సిందిగా స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ఈ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ జోక్యం చేసుకున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎంపీ సభ్యత్వ పునరుద్ధరణతో లోక్‌సభకు వచ్చిన రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు.
‘‘నాకు తెలిసినంత వరకు.. 11.55 గంటల సమయంలో లోక్‌సభ సెక్రటేరియెట్‌కు ఓ లేఖ అందింది. చర్చను గౌరవ్ గొగోయ్‌కి బదులు రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని అందులో పేర్కొన్నారు. మరి ఐదు నిమిషాల్లోనే ఏమైంది సర్? సమస్య ఏంటి సర్? రాహుల్ గాంధీ ఏం చెబుతారోనని వెయిటింగ్ సర్” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. తర్వాత సభలో పరిస్థితి సద్దుమణిగాక.. చర్చను ప్రారంభించాల్సిందిగా గొగోయ్‌ని స్పీకర్ కోరారు.