భారత్‌కు చావో రేవో..నేడు వెస్టిండీస్‌తో మూడో టీ20

  • తొలి రెండు టీ20ల్లో ఓడిన టీమిండియా
  • నిరాశ పరుస్తున్న బ్యాటర్లు
  • నేటి మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ కోల్పోనున్న భారత్
తొలి టీ20లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం. రెండో మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో ఓటమి. ఫలితంగా వెస్టిండీస్ తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టు 0–2తో వెనుకంజలో ఉంది. మరో మ్యాచ్‌లో ఓడితే అనామక విండీస్‌ చేతిలో సిరీస్‌ కోల్పోయిన అపఖ్యాతిని మూటగట్టుకోనుంది. అది తప్పించుకోవాలంటే మూడో టీ20లో భారత్ గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో భారత్.. వెస్టిండీస్‌తో చావో రేవో తేల్చుకోనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న విండీస్‌ అదే జోరుతో ఈ మ్యాచ్‌లో నూ గెలిచి సిరీస్ నెగ్గాల్ని చూస్తోంది. 

మరోవైపు వరుస ఓటములతో ఒత్తిడిమీద ఉన్న హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలోని టీమిండియా పుంజుకోవాలని చూస్తోంది. అది జరగాలంటే బ్యాటర్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది. వన్డేల్లో రాణించిన గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఫామ్‌ కొనసాగించడంలో విఫలమవుతున్నారు. వీరికి తోడు సూర్యకుమార్‌, శాంసన్‌, హార్దిక్‌ వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది. భారత జట్టులోకి కొత్తగా వచ్చిన హైదరాబాదీ తిలక్‌వర్మ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. అతనికి మిగతా వారి నుంచి సహకారం లభిస్తేనే భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలుస్తుంది. ఇక, బౌలింగ్‌లో ముకేశ్‌ కుమార్‌ చివరి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. అతని స్థానంలో అవేశ్‌ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ లలో ఒకరు తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. చాహల్‌కు తోడు కుల్దీప్‌యాదవ్‌ తిరిగి జట్టులోకి రానున్నాడు.


More Telugu News