కరోనా టైంలో మూన్‌లైటింగ్ చేసిన ఉద్యోగులకు ఐటీ శాఖ షాక్!

  • ఐటీ, అకౌంటింగ్, మేనేజ్‌మెంట్ ఉద్యోగుల మూన్‌లైటింగ్
  • రెండు కంటే ఎక్కువ కంపెనీల నుంచి పారితోషికాలు, 
  • ఉద్యోగులు  ఈ ఆదాయాన్ని పన్ను లెక్కల్లో వెల్లడించలేదని గుర్తించిన ఐటీ శాఖ
  • 1100 మందికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం
కరోనా సంక్షోభ సమయంలో మూన్ లైటింగ్‌తో పొందిన అదనపు ఆదాయాన్ని లెక్కల్లో చూపని ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 1100 నోటీసులు జారీ అయినట్టు సమాచారం. 2019-2021 కాలంలో ఆదాయంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. 

ప్రధాన ఉద్యోగానికి తోడు ఖాళీ సమయాల్లో మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారన్న విషయం తెలిసిందే. కరోనా టైంలో అనేక మంది, ముఖ్యంగా టెకీలకు వర్క్ ఫ్రం హోం సౌకర్యంతో ఖాళీ సమయం దొరికింది. దీంతో, అనేక మంది మూన్‌లైటింగ్ చేస్తూ ఆర్థికంగా లాభ పడ్డారన్న వార్తలు అప్పట్లో సంచలనం కలిగించాయి. మూన్‌లైటింగ్ ద్వారానే ఉద్యోగులు అధిక ఆదాయం పొందినట్టు కూడా వెల్లడైంది. 

మూన్‌లైటింగ్ తాలూకు చెల్లింపుల్లో అధికభాగం ఆన్‌లైన్‌లో జరగడంతో పన్ను లెక్కల్లో అవకతవకలను ఐటీ శాఖ గుర్తించగలిగింది. ‘‘ఐటీ, అకౌంటింగ్, మేనేజ్ మెంట్ ఉద్యోగులు అనేక మంది రెండు అంతకంటే ఎక్కువ కంపెనీల నుంచి నెలవారీ లేదా మూడు నెలలకు ఓసారి శాలరీలు పొందారు. ఈ అదనపు ఆదాయన్ని పన్ను లెక్కల్లో వారు చూపలేదని మేము గుర్తించాం’’ అని ఐటి శాఖ ఉన్నతాధికారి ఒకరు జాతీయమీడియాతో వ్యాఖ్యానించారు.


More Telugu News