ముగిసిన ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు
- మహాబోధి స్కూల్ ఆవరణలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
- ఎల్బీ స్టేడియం నుండి అల్వాల్ వరకు అంతిమయాత్ర
- పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు
ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిశాయి. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ ఆవరణలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో బౌద్ధ సంప్రదాయం ప్రకారం పూర్తి చేశారు. మధ్యాహ్నం గం.12 సమయానికి ఎల్బీ స్టేడియం నుండి ప్రారంభమైన అంతిమయాత్ర గన్ పార్క్, అమరుల స్థూపం, ట్యాంక్ బండ్, అల్వాల్ వరకు కొనసాగింది. అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద పార్థివదేహాన్ని కొద్దిసేపు ఉంచారు. ఆ తర్వాత స్కూల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. గద్దర్‌ను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.